1 Kings

1రాజులు 5

18 వచనాలు 22 అధ్యాయాలలో 5
1రాజులు 5 — ఆడియో
అధ్యాయం 5 / 22
1రాజులు 5 18 వచనాలు
1

తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.

2

హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.

3

యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచువరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.

4

తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేకపోయెనన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి యున్నాడు.

5

కాబట్టి నీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రియైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.

6

లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పనిచేయుదురు; మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక

7

నీ యేర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి

8

సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.

9

నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహారము ఇచ్చెదవు.

10

హీరాము సొలొమోనునకు ఇష్టమైనంతమట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా

11

సొలొమోను హీరామునకును అతని యింటివారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడువేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.

12

యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియు హీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.

13

రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టిపని చేయువారైరి,

14

వీరిని అతడు వంతులచొప్పున నెలకు పదివేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.

15

మరియు సొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎనుబది వేలమందియు నుండిరి.

16

వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.

17

రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కినరాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.

18

ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారులును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.

అధ్యాయం 4 అన్ని అధ్యాయాలు అధ్యాయం 6
క్రాస్ రిఫరెన్సులు