Ezra

ఎజ్రా 3

13 వచనాలు 10 అధ్యాయాలలో 3
ఎజ్రా 3 — ఆడియో
అధ్యాయం 3 / 10
ఎజ్రా 3 13 వచనాలు
1

ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి,

2

యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.

3

వారు దేశమందు కాపురస్థులైన వారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి

4

మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.

5

తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.

6

ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.

7

మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోనునుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి.

8

యెరూషలేములోనుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి.

9

యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైన వారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పని చేయించుటకు నియమింపబడిరి.

10

శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

11

వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.

12

మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి.

13

ఏది సంతోష శబ్దమో యేది దుఃఖ శబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.

అధ్యాయం 2 అన్ని అధ్యాయాలు అధ్యాయం 4
క్రాస్ రిఫరెన్సులు