Galatians

గలతీయులకు 1

24 వచనాలు 6 అధ్యాయాలలో 1
గలతీయులకు 1 — ఆడియో
అధ్యాయం 1 / 6
గలతీయులకు 1 24 వచనాలు
1

మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తువలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,

2

నాతో కూడ నున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.

3

తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

4

మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

5

దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

6

క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

7

అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

8

మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

9

మేమిదివరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక.

10

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

11

సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12

మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

13

పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు

14

నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.

15

అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని

16

ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.

17

నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

18

అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడ పదునయిదు దినములుంటిని.

19

అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.

20

నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.

21

పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని.

22

క్రీస్తునందున్న యూదయ సంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని

23

మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని,

24

వారు నన్నుబట్టి దేవుని మహిమ పరచిరి.

అన్ని అధ్యాయాలు అధ్యాయం 2
క్రాస్ రిఫరెన్సులు