Luke

లూకా 11

54 వచనాలు 24 అధ్యాయాలలో 11
లూకా 11 — ఆడియో
అధ్యాయం 11 / 24
లూకా 11 54 వచనాలు
1

ఆయన యొకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయననడిగెను.

2

అందుకాయన మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక,

3

మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;

4

మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మాపాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.

5

మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితునియొద్దకు వెళ్లి స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము;

6

నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల

7

అతడు లోపలనే యుండి నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?

8

అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.

9

అటువలె మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.

10

అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.

11

మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా?

12

కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా

13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

14

ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.

15

అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి.

16

మరికొందరు ఆయనను శోధించుచు పరలోకమునుండి యొక సూచక క్రియను చూపుమని ఆయననడిగిరి.

17

ఆయన వారి ఆలోచనలనెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.

18

సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.

19

నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు.

20

అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.

21

బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.

22

అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.

23

నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.

24

అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని

25

వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి

26

వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను.

27

ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలువేసి చెప్పగా

28

ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.

29

మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెను ఈ తరమువారు దుష్టతరమువారై యుండి సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు.

30

యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్యకుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.

31

దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితో కూడ లేచి వారిమీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.

32

నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితో కూడ నిలువబడి వారిమీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.

33

ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును.

34

నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగానుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.

35

కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియై యుండకుండ చూచుకొనుము.

36

ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.

37

ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను.

38

ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.

39

అందుకు ప్రభువిట్లనెను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండియున్నది.

40

అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా?

41

కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును.

42

అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది

43

అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు.

44

అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను.

45

అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా, యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా

46

ఆయన అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.

47

అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.

48

కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు.

49

అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.

50

వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.

51

కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమువారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను.

52

అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.

53

ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నిండ పగబట్టి ఆయనమీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,

54

వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

అధ్యాయం 10 అన్ని అధ్యాయాలు అధ్యాయం 12
క్రాస్ రిఫరెన్సులు