నహూము 3
నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.
సారధియొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి.
రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చిన వారు కుప్పలుకుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికితగిలి జనులు తొట్రిల్లుచున్నారు.
చక్కనిదానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గలదానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా,
నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను నీకు విరోధినైయున్నాను, నీచెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.
పదిమంది యెదుట నీమీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను.
అప్పుడు నిన్ను చూచువారందరు నీయొద్దనుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చువారిని ఎక్కడనుండి పిలుచుకొని వచ్చెదము అందురు.
సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నోఅమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?
కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తారజనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులైయుండిరి.
అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.
నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.
అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;
నీ జనులు స్త్రీలవంటి వారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల యడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.
ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగటమంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము.
అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళిపురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.
నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగా నున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.
నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరిపోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.
అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు.
నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త వినువారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.