మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లుచేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.
2
మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలు గలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.
3
వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
4
ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
5
అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.
6
ఏడు తెగుళ్లుచేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.
7
అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.
8
అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను