1సమూయేలు 13
సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను
ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచుకొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.
యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.
సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి.
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.
ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.
కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లిపోయిరి గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.
సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తనయొద్దనుండి చెదరిపోవుటయు చూచి
దహన బలులను సమాధాన బలులను నాయొద్దకు తీసికొనిరమ్మని చెప్పి దహనబలి అర్పించెను.
అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా
సమూయేలు అతనితో నీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలు జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి
ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను.
అందుకు సమూయేలు ఇట్లనెను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను; అయితే నీ రాజ్యము నిలువదు.
యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.
సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.
సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్నవారితో కూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి.
మరియు ఫిలిష్తీయుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను.
రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను.
హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండ చేసియుండిరి.
కాబట్టి ఇశ్రాయేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసివచ్చెను.
అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారియొద్ద నుండెను.
కాబట్టి యుద్ధదినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకనిచేతిలోనైనను కత్తియే గాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.
ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.