మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవికాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి
2
ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను.
3
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.
తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారా,
6
దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదినమెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
7
యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా వారి క్రియలను నేనెన్నడును మరువను.
8
ఇందునుగూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలు నదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపు నదివలె అది అణగిపోవును.
9
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.
10
మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకమువంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును.
11
రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.
12
కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రము వరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;
13
ఆ దినమందు చక్కని కన్యలును యౌవనులును దప్పిచేత సొమ్మసిల్లుదురు.
14
షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దానూ, నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.