Ecclesiastes

ప్రసంగి 3

22 వచనాలు 12 అధ్యాయాలలో 3
ప్రసంగి 3 — ఆడియో
అధ్యాయం 3 / 12
ప్రసంగి 3 22 వచనాలు
1

ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.

2

పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,

3

చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;

4

ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

5

రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6

వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు;

7

చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

8

ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.

9

కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?

10

నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.

11

దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.

12

కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని.

13

మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.

14

దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.

15

ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగినదే; జరిగిపోయిన దానిని దేవుడు మరల రప్పించును.

16

మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.

17

ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.

18

కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని.

19

నరులకు సంభవించునది యేదో అదే, మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.

20

సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.

21

నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?

22

కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.

అధ్యాయం 2 అన్ని అధ్యాయాలు అధ్యాయం 4
క్రాస్ రిఫరెన్సులు