Ecclesiastes

ప్రసంగి 6

12 వచనాలు 12 అధ్యాయాలలో 6
ప్రసంగి 6 — ఆడియో
అధ్యాయం 6 / 12
ప్రసంగి 6 12 వచనాలు
1

సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది

2

ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.

3

ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను

4

అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను.

5

అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మది గలది.

6

అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానక యున్నయెడల వాని గతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా.

7

మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు.

8

బుద్ధిహీనులకంటె జ్ఞానుల విశేషమేమి? సజీవులయెదుట బ్రదుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి?

9

మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు; ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే.

10

ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను; ఆ యా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను; తమకంటె బలవంతుడైన వానితో వారు వ్యాజ్యెమాడజాలరు.

11

పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము?

12

నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదొ యవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?

అధ్యాయం 5 అన్ని అధ్యాయాలు అధ్యాయం 7
క్రాస్ రిఫరెన్సులు