మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరోమీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.
2
కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.
3
యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.
4
మోషే ఫరోతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలువెళ్లెదను.
5
అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలి పిల్లలన్నియు చచ్చును
6
అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.
7
యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
8
అప్పుడు నీ సేవకులైన వీరందరు నాయొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలువెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరోయెద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను
9
అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.
10
మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.