నిర్గమకాండము 33
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవును నీవు ఐగుప్తు దేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.
నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.
మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను.
ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.
అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను
మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారములోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచుచుండెను.
మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.
ప్రజలందరు ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి, లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి.
మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు.
మోషే యెహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొనిపొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.
కాబట్టి నీ కటాక్షము నాయెడల కలిగినయెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.
అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
మోషే నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొనిపోకుము.
నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.
కాగా యెహోవా నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా
అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా
ఆయన నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.
మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.
నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నాచేతితో నిన్ను కప్పెదను;
నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.