Hosea

హోషేయ 11

12 వచనాలు 14 అధ్యాయాలలో 11
హోషేయ 11 — ఆడియో
అధ్యాయం 11 / 14
హోషేయ 11 12 వచనాలు
1

ఇశ్రాయేలు బాలుడై యుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తు దేశములోనుండి పిలిచితిని.

2

ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి.

3

ఎఫ్రాయిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు

4

ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని

5

ఐగుప్తు దేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారిమీద ప్రభుత్వము చేయును.

6

వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును.

7

నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు

8

ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లుచేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లుచేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నది.

9

నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.

10

వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.

11

వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.

12

ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.

అధ్యాయం 10 అన్ని అధ్యాయాలు అధ్యాయం 12
క్రాస్ రిఫరెన్సులు