Hosea

హోషేయ 9

17 వచనాలు 14 అధ్యాయాలలో 9
హోషేయ 9 — ఆడియో
అధ్యాయం 9 / 14
హోషేయ 9 17 వచనాలు
1

ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీద నున్న ధాన్యమునుబట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.

2

కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారమునియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.

3

ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.

4

యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలె నగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు.

5

నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమిచేతురు?

6

లయము సంభవించినందున జనులు వెళ్లిపోయి యున్నారు; ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణము వారికి శ్మశానభూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువులను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాసస్థలములో పెరుగును.

7

శిక్షాదినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగినవారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.

8

ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్య యంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.

9

గిబియాలో చెడుకార్యములు జరిగిననాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.

10

అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించిన దానివలెనే వారు హేయులైరి.

11

ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.

12

వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

13

లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.

14

యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండురొమ్ములుగల వారినిగాను చేయుము.

15

వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలనుబట్టి వారినికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.

16

ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.

17

వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.

అధ్యాయం 8 అన్ని అధ్యాయాలు అధ్యాయం 10
క్రాస్ రిఫరెన్సులు