Jeremiah

యిర్మియా 2

37 వచనాలు 52 అధ్యాయాలలో 2
యిర్మియా 2 — ఆడియో
అధ్యాయం 2 / 52
యిర్మియా 2 37 వచనాలు
1

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

2

నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగని దేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

3

అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు.

4

యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.

5

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగిపోయిరి?

6

ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడనున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.

7

దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్యాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.

8

యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్‌ప్రయోజనమైనవాటిని అనుసరింతురు

9

కావున నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు.

10

కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?

11

దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.

12

ఆకాశమా, దీనిబట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపొమ్ము; ఇదే యెహోవా వాక్కు.

13

నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

14

ఇశ్రాయేలు కొనబడిన దాసుడా? యింటపుట్టిన దాసుడా? కాడు గదా; అతడేల దోపుడుసొమ్మాయెను?

15

కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశము పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడాయెను.

16

నోపు, తహపనేసు అను పట్టణములవారు నీ నెత్తిని బద్దలు చేసిరి.

17

నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.

18

నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.

19

నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నాయెడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

20

పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.

21

శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టువంటి దానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతానమైతివి?

22

నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు.

23

నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,

24

అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగలవాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసియుండదు, దాని మాసములో అది కనబడును.

25

జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.

26

దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.

27

వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములో లేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.

28

నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.

29

మీరందరు నామీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు.

30

నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.

31

ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పుచున్నారు?

32

కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.

33

కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.

34

మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడుచున్నది.

35

అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.

36

నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.

37

చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్దనుండి బయలువెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.

అధ్యాయం 1 అన్ని అధ్యాయాలు అధ్యాయం 3
క్రాస్ రిఫరెన్సులు