Jeremiah

యిర్మియా 34

22 వచనాలు 52 అధ్యాయాలలో 34
యిర్మియా 34 — ఆడియో
అధ్యాయం 34 / 52
యిర్మియా 34 22 వచనాలు
1

బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.

2

ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించుచున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును.

3

నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.

4

యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము నిన్నుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గమువలన మృతిబొందక నెమ్మదిగానే మృతిబొందెదవు.

5

నీకంటె ముందుగానుండిన పూర్వరాజులైన నీ పితరులకొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు -- అయ్యో నా యేలినవాడా, అని నిన్నుగూర్చి అంగలార్చుచు జనులు నీకొరకును ధూపద్రవ్యము కాల్చుదురు; ఆలాగు కావలెనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

6

యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములుగల పట్టణములుగా మిగిలియున్నవి,

7

బబులోను రాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచు వచ్చెను.

8

యూదులచేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులనుగాని హెబ్రీయురాండ్రనుగాని అందరిని విడిపించునట్లు విడుదల చాటింపవలెనని

9

రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

10

ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్నవారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారిచేత కొలువు చేయించుకొనమనియు, ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.

11

అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచుకొనిరి.

12

కావున యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

13

ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసితిని.

14

నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి.

15

మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని యొక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి, నా పేరు పెట్టబడిన యీ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి.

16

పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత, అందరును తమ దాసదాసీలను మరల పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరచుకొంటిరి

17

కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యములన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.

18

మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను;

19

అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.

20

వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.

21

యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండుచేతికిని అప్పగించుచున్నాను.

22

యెహోవా వాక్కు ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించుచున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.

అధ్యాయం 33 అన్ని అధ్యాయాలు అధ్యాయం 35
క్రాస్ రిఫరెన్సులు