మత్తయి 11
యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను.
క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని రాబోవువాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా?
అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను.
యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి.
గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తరమిచ్చెను.
వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహానునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?
సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.
మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.
ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును.
స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు.
బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.
యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుండెను.
ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
వినుటకు చెవులుగలవాడు వినుగాక.
ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి
మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.
యోహాను తినకయు త్రాగకయు వచ్చెను. గనుక వీడు దయ్యముపట్టినవాడని వారనుచున్నారు.
మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.
పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను.
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొందియుందురు
విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును.
విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడియున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.