మత్తయి 20
ఏలాగనగా పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి
దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి
మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా
వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.
సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చినవారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.
దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారము చొప్పున తీసికొనిరి.
మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారము చొప్పుననే దొరకెను.
వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను,
పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి.
అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;
నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;
నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.
ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.
ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి
ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారము చేసి యొక మనవి చేయబోగా
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అని అడుగగా వారు త్రాగగలమనిరి.
ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను.
తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి
గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.
మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;
మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్లెను.
ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని విని ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.
ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.
యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా
వారు ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి.
కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.