Zechariah

జెకర్యా 13

9 వచనాలు 14 అధ్యాయాలలో 13
జెకర్యా 13 — ఆడియో
అధ్యాయం 13 / 14
జెకర్యా 13 9 వచనాలు
1

ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడును.

2

ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండచేతును.

3

ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు.

4

ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు, తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.

5

వాడు నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును.

6

నీచేతులకు గాయములేమని వారడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.

7

ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరి మీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు గొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.

8

దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.

9

ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.

అధ్యాయం 12 అన్ని అధ్యాయాలు అధ్యాయం 14
క్రాస్ రిఫరెన్సులు