Deuteronomy

ద్వితియోపదేశాకాండము 24

22 వచనాలు 34 అధ్యాయాలలో 24
ద్వితియోపదేశాకాండము 24 — ఆడియో
అధ్యాయం 24 / 34
ద్వితియోపదేశాకాండము 24 22 వచనాలు
1

ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసికొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను.

2

ఆమె అతని యింటనుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.

3

ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడల నేమి

4

ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు.

5

ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోపకూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింటఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను.

6

తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే.

7

ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు.

8

కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి.

9

మీరు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసినదానిని జ్ఞాపకముంచుకొనుడి.

10

నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు

11

నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.

12

ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.

13

అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.

14

నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడియ్యవలెను.

15

సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశపెట్టుకొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టునేమో అది నీకు పాపమగును.

16

కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును.

17

పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.

18

నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించెనని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.

19

నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను.

20

నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను.

21

నీ ద్రాక్షపండ్లను కోసికొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను.

22

నీవు ఐగుప్తు దేశమందు దాసుడవైయుంటివని జ్ఞాపకము చేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.

అధ్యాయం 23 అన్ని అధ్యాయాలు అధ్యాయం 25
క్రాస్ రిఫరెన్సులు