Deuteronomy

ద్వితియోపదేశాకాండము 8

20 వచనాలు 34 అధ్యాయాలలో 8
ద్వితియోపదేశాకాండము 8 — ఆడియో
అధ్యాయం 8 / 34
ద్వితియోపదేశాకాండము 8 20 వచనాలు
1

మీరు బ్రదికి అభివృద్ధినొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనునట్లు నేడు నేను నీకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.

2

మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము.

3

ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.

4

ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.

5

ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని

6

ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను.

7

నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.

8

అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.

9

కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.

10

నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.

11

నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని

12

మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,

13

నీ పశువులు నీ గొఱ్ఱమేకలును వృద్ధియై నీకు వెండిబంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినప్పుడు

14

నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో.

15

తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను,

16

తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.

17

అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.

18

కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.

19

నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతలననుసరించి పూజించి నమస్కరించినయెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను.

20

నీ యెదుట నుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.

అధ్యాయం 7 అన్ని అధ్యాయాలు అధ్యాయం 9
క్రాస్ రిఫరెన్సులు