Deuteronomy

ద్వితియోపదేశాకాండము 34

12 వచనాలు 34 అధ్యాయాలలో 34
ద్వితియోపదేశాకాండము 34 — ఆడియో
అధ్యాయం 34 / 34
ద్వితియోపదేశాకాండము 34 12 వచనాలు
1

మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.

2

అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును

3

సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయచుట్టు మైదానమును అతనికి చూపించెను.

4

మరియు యెహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నదిదాటి అక్కడికి వెళ్లకూడదు.

5

యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను.

6

బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.

7

మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.

8

ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను.

9

మోషే తనచేతులను నూను కుమారుడైన యెహోషువమీద ఉంచియుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

10

ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని

11

అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో

12

వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులయెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు.

అధ్యాయం 33 అన్ని అధ్యాయాలు
క్రాస్ రిఫరెన్సులు