దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను
2
ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవావలన కలిగినయెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి
3
మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.
4
ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.
5
కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొనివచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు నుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.