2 Kings

2రాజులు 1

18 వచనాలు 25 అధ్యాయాలలో 1
2రాజులు 1 — ఆడియో
అధ్యాయం 1 / 25
2రాజులు 1 18 వచనాలు
1

అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.

2

అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా

3

యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను నీవులేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా?

4

కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా నీవెక్కిన మంచము మీదనుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను.

5

తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారినడుగగా

6

వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే; నీవెక్కిన మంచముమీదనుండి దిగిరాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా

7

మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.

8

అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.

9

వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్బునియుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.

10

అందుకు ఏలీయా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించును గాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.

11

మరల రాజు ఏబది మందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.

12

అందుకు ఏలీయా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించును గాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.

13

ఇంకను రాజు ఏబది మందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితో కూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.

14

చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని వాని యేబదిమందితో కూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవిచేయగా

15

యెహోవా దూత వానికి భయపడక వానితోకూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితోకూడ రాజునొద్దకు వచ్చెను.

16

అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగిరాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.

17

ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను.

18

అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

అన్ని అధ్యాయాలు అధ్యాయం 2
క్రాస్ రిఫరెన్సులు