2 Kings

2రాజులు 10

36 వచనాలు 25 అధ్యాయాలలో 10
2రాజులు 10 — ఆడియో
అధ్యాయం 10 / 25
2రాజులు 10 36 వచనాలు
1

షోమ్రోనులో అహాబునకు డెబ్బదిమంది కుమారులుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులోనుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచినవారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీయొద్ద నున్నారు;

2

మరియు మీకు రథములును గుఱ్ఱములును ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు గదా

3

కాబట్టి యీ తాకీదు మీకు ముట్టినవెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని, తన తండ్రి సింహాసనముమీద అతనిని ఆసీనునిగా చేసి, మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడుడి.

4

వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని

5

కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి యెహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి.

6

అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనినయెడల మీ యజమానుని కుమారుల తలలను తీసికొని, రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బదిమంది రాజకుమారులును వారిని పెంచిన పట్టణపు పెద్దలయొద్ద ఉండిరి.

7

కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బదిమంది రాజకుమారులను పట్టుకొని చంపి, వారి తలలను గంపలలో పెట్టి, యెజ్రెయేలులోనున్న అతనియొద్దకు పంపిరి.

8

దూత అతనియొద్దకు వచ్చిరాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయమువరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను.

9

ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి, జనులందరిని చూచి మీరు నిర్దోషులు, నేను నా యజమానునిమీద కుట్రచేసి అతని చంపితిని; అయితే వీరందరిని ఎవరు చంపిరి?

10

అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను.

11

ఈ ప్రకారము యహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువులనందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.

12

అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొఱ్ఱ వెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి

13

యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరని వారినడుగగా వారు మేము అహజ్యా సహోదరులము; రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి.

14

వారిని సజీవులగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱ వెండ్రుకలు కత్తిరించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి.

15

అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి నీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా అని అతనినడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. ఆలాగైతే నాచేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని

16

యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.

17

అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయువరకు హతముచేయుట మానకుండెను.

18

తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజ చేయబోవుచున్నాను,

19

కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందిరిని వాని భక్తులనందరిని వారి యాజకులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను.

20

మరియు యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి.

21

యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈ తట్టునుండి ఆ తట్టువరకు నిండిపోయెను.

22

అప్పుడతడు వస్త్రశాలమీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కువారి కందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను.

23

యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీయొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారు మాత్రమే యుండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను.

24

బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ యెనుబదిమందిని బయట కావలియుంచి నేను మీ వశముచేసినవారిలో ఒకడైన తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను.

25

దహనబలుల నర్పించుట సమాప్తికాగా యెహూ మీరు లోపల చొచ్చి యొకడైనను బయటికిరాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతులతోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి

26

బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొనివచ్చి వాటిని కాల్చివేసిరి.

27

మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగేయున్నది

28

ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలువారి మధ్య నుండకుండ నాశనము చేసెను.

29

అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూకూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు.

30

కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన యంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనముమీద ఆసీనులగుదురు.

31

అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయెను.

32

ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను.

33

హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలోనున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబెనియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను.

34

యెహూ చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

35

అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.

36

షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు.

అధ్యాయం 9 అన్ని అధ్యాయాలు అధ్యాయం 11
క్రాస్ రిఫరెన్సులు