Acts

అపోస్తలులకార్యములు 10

48 వచనాలు 28 అధ్యాయాలలో 10
అపోస్తలులకార్యములు 10 — ఆడియో
అధ్యాయం 10 / 28
అపోస్తలులకార్యములు 10 48 వచనాలు
1

ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతియైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.

2

అతడు తన యింటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మముచేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.

3

పగలు ఇంచుమించు మూడుగంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

4

అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

5

ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;

6

అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.

7

అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తనయొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి

8

వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.

9

మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెమీది కెక్కెను.

10

అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై

11

ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.

12

అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.

13

అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.

14

అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా

15

దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను.

16

ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను.

17

పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

18

పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి

19

పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు.

20

నీవు లేచి క్రిందికి దిగి, సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.

21

పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణమేమని అడిగెను.

22

అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి నిన్ను పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ద దూతవలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలి పిలిచి ఆతిధ్యమిచ్చెను

23

మరునాడు అతడు లేచి, వారితో కూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితో కూడ వెళ్లిరి.

24

మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.

25

పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను.

26

అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి

27

అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.

28

అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించియున్నాడు

29

కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువనంపితిరో దానినిగూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను.

30

అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి

31

కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడియున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి

32

పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.

33

వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను

34

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.

35

ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

36

యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.

37

యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును

38

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (అనగా సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను

39

ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.

40

దేవుడాయనను మూడవ దినమున లేపి

41

ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.

42

ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.

43

ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను.

44

పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.

45

సున్నతి పొందినవారిలో పేతురుతో కూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి.

46

ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.

47

అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి

48

యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.

అధ్యాయం 9 అన్ని అధ్యాయాలు అధ్యాయం 11
క్రాస్ రిఫరెన్సులు