Acts

అపోస్తలులకార్యములు 19

41 వచనాలు 28 అధ్యాయాలలో 19
అపోస్తలులకార్యములు 19 — ఆడియో
అధ్యాయం 19 / 28
అపోస్తలులకార్యములు 19 41 వచనాలు
1

అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారినడుగగా

2

వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.

3

అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి.

4

అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.

5

వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.

6

తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.

7

వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు.

8

తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.

9

అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాటశాలలో తర్కించుచు వచ్చెను

10

రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.

11

మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;

12

అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలిపోయెను.

13

అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి

14

యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.

15

అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా

16

ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.

17

ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.

18

విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.

19

మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్కచూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.

20

ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.

21

ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను.

22

అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.

23

ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.

24

ఏలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండిగుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను.

25

అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును.

26

అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు

27

మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడికూడ తృణీకరింపబడి, ఆసియ యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను.

28

వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి;

29

పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.

30

పౌలు జనుల సభయొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.

31

మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.

32

ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు.

33

అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములోనుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.

34

అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏక శబ్దముతో రెండు గంటలసేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి.

35

అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతి యొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియనివాడెవడు

36

ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము.

37

మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.

38

దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యెమాడవచ్చును.

39

అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును.

40

మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.

41

అతడీలాగు చెప్పి సభను ముగించెను.

అధ్యాయం 18 అన్ని అధ్యాయాలు అధ్యాయం 20
క్రాస్ రిఫరెన్సులు