Genesis

ఆదికాండము 27

46 వచనాలు 50 అధ్యాయాలలో 27
ఆదికాండము 27 — ఆడియో
అధ్యాయం 27 / 50
ఆదికాండము 27 46 వచనాలు
1

ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.

2

అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.

3

కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులపొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.

4

నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.

5

ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.

6

అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో

7

మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధ పరచుమని చెప్పగా వింటిని.

8

కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.

9

నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను.

10

నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రియొద్దకు తీసికొనిపోవలెననెను.

11

అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.

12

ఒకవేళ నాతండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను.

13

అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా

14

అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపఱచెను.

15

మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తనయొద్ద నుండెను గనుక

16

రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతనిచేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి

17

తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబుచేతికియ్యగా

18

అతడు తన తండ్రియొద్దకు వచ్చినా తండ్రీ, అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను

19

అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను

20

అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.

21

అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను.

22

యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి స్వరము యాకోబు స్వరము గానిచేతులు ఏశావుచేతులే అనెను.

23

యాకోబుచేతులు అతని అన్నయైన ఏశావుచేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి

24

ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను.

25

అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.

26

తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దుపెట్టుకొమ్మని అతనితో చెప్పెను.

27

అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది

28

ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించు గాక

29

జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక

30

ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.

31

అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చి నా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.

32

అతని తండ్రియైన ఇస్సాకు నీవెవరవని అతని నడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా

33

ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.

34

ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.

35

అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.

36

ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చియుంచలేదా అని అడిగెను.

37

అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలననిఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా

38

ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు

39

నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును.

40

నీవు నీ కత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.

41

తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రినిగూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.

42

రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్నుగూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు.

43

కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారువరకు

44

నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;

45

అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొననేల అనెను.

46

మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.

అధ్యాయం 26 అన్ని అధ్యాయాలు అధ్యాయం 28
క్రాస్ రిఫరెన్సులు