Genesis

ఆదికాండము 31

55 వచనాలు 50 అధ్యాయాలలో 31
ఆదికాండము 31 — ఆడియో
అధ్యాయం 31 / 50
ఆదికాండము 31 55 వచనాలు
1

లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.

2

మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.

3

అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా

4

యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను.

5

మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;

6

మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసేయున్నది.

7

మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు.

8

అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లలనీనెను

9

అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.

10

మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను.

11

మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.

12

అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని

13

నీవెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.

14

అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలుపంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుట లేదా?

15

అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.

16

దేవుడు మా తండ్రియొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికుత్తర మియ్యగా

17

యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి

18

కనాను దేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొనిపోయెను.

19

లాబాను తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.

20

యాకోబు తాను పారిపోవుచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుటవలన అతని మోసపుచ్చిన వాడాయెను.

21

అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.

22

యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను.

23

అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.

24

ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.

25

లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.

26

అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారినివలె నా కుమార్తెలను కొనిపోవనేల?

27

నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.

28

అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొన నియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.

29

మీకు హాని చేయుటకు నాచేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.

30

నీ తండ్రి యింటిమీద బహు వాంఛగల వాడవై వెళ్లగోరినయెడల వెళ్లుము, నా దేవతల నేల దొంగిలితివనగా

31

యాకోబు నీవు బలవంతముగా నాయొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని

32

ఎవరియొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రదుకకూడదు. నీవు నాయొద్దనున్న వాటిని మన బంధువుల యెదుట వెదకి నీ దానిని తీసికొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు.

33

లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాసీల గుడారములలోనికి వెళ్లెను గాని అతని కేమియు దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్లెను.

34

రాహేలు ఆ విగ్రహములను తీసికొని ఒంటె సామగ్రిలో పెట్టి వాటిమీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచినప్పటికిని అవి దొరకలేదు.

35

ఆమె తన తండ్రితో తమయదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు; నేను కడగానున్నానని చెప్పెను. అతడెంత వెదకినను ఆ విగ్రహములు దొరకలేదు.

36

యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేల? నేను చేసిన ద్రోహమేమి? పాపమేమి?

37

నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నావారి యెదుటను నీవారి యెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.

38

ఈ యిరువది యేండ్లు నేను నీయొద్ద నుంటిని. నీ గొఱ్ఱలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు.

39

దుష్టమృగములచేత చీల్చబడిన దానిని నీయొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దానినేమి రాత్రియందు దొంగిలింపబడిన దానినేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని.

40

పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.

41

ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.

42

నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టిచేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నాచేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.

43

అందుకు లాబాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను?

44

కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా

45

యాకోబు ఒక రాయి తీసికొని దానిని స్తంభముగా నిలువబెట్టెను.

46

మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి; అక్కడ వారు ఆ కుప్పయొద్ద భోజనము చేసిరి.

47

లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.

48

లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.

49

అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను,

50

చూడుము, మనయొద్ద ఎవరును లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను.

51

మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము.

52

హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీయొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నాయొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.

53

అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మనమధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను

54

యాకోబు ఆ కొండమీద బలియర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి.

55

తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దుపెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్లి పోయెను.

అధ్యాయం 30 అన్ని అధ్యాయాలు అధ్యాయం 32
క్రాస్ రిఫరెన్సులు