Genesis

ఆదికాండము 30

43 వచనాలు 50 అధ్యాయాలలో 30
ఆదికాండము 30 — ఆడియో
అధ్యాయం 30 / 50
ఆదికాండము 30 43 వచనాలు
1

రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.

2

యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.

3

అందుకామె నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమెవలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి

4

తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా

5

బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.

6

అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.

7

రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.

8

అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.

9

లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.

10

లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా

11

లేయా ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను.

12

లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా

13

లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.

14

గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా

15

ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.

16

సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నాయొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.

17

దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.

18

లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.

19

లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.

20

అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను

21

ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను.

22

దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.

23

అప్పుడామె గర్భవతియై కుమారుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను.

24

మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

25

రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.

26

నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.

27

అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

28

మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.

29

అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;

30

నేను రాక మునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదము పెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.

31

అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను.

32

నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱను, గొఱ్ఱపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును.

33

ఇకమీదట నాకు రావలసిన జీతమునుగూర్చి నీవు చూడ వచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱపిల్లలలో నలుపు లేనివన్నియు నాయొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.

34

అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కానిమ్మనెను.

35

ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరుచేసి తన కుమారులచేతి కప్పగించి

36

తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను.

37

యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి

38

మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా

39

మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.

40

యాకోబు ఆ గొఱ్ఱపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను.

41

మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను.

42

మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను.

43

ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

అధ్యాయం 29 అన్ని అధ్యాయాలు అధ్యాయం 31
క్రాస్ రిఫరెన్సులు