Genesis

ఆదికాండము 33

20 వచనాలు 50 అధ్యాయాలలో 33
ఆదికాండము 33 — ఆడియో
అధ్యాయం 33 / 50
ఆదికాండము 33 20 వచనాలు
1

యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును, అతనితో నాలుగువందల మంది మనుష్యులును వచ్చుచుండిరి.

2

అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును, యోసేపును ఉంచి

3

తాను వారిముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.

4

అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.

5

ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను.

6

అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.

7

లేయాయు ఆమె పిల్లలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.

8

ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నామీద వచ్చుటకే అని చెప్పెను.

9

అప్పుడు ఏశావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.

10

అప్పుడు యాకోబు అట్లు కాదు; నీ కటాక్షము నామీద నున్నయెడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా

11

నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని

12

మనము వెళ్లుదము; నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా

13

అతడు నాయొద్ద నున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.

14

నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువు నొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను.

15

అప్పుడు ఏశావు నీకిష్టమైనయెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీయొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను.

16

ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.

17

అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక యిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.

18

అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.

19

మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని

20

అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.

అధ్యాయం 32 అన్ని అధ్యాయాలు అధ్యాయం 34
క్రాస్ రిఫరెన్సులు