Psalms

కీర్తనలు 35

28 వచనాలు 150 అధ్యాయాలలో 35
కీర్తనలు 35 — ఆడియో
అధ్యాయం 35 / 150
కీర్తనలు 35 28 వచనాలు
1

యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.

2

కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.

3

ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.

4

నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక.

5

యెహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురుగాక.

6

యెహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండునుగాక.

7

నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.

8

వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక.

9

అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.

10

అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.

11

కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.

12

మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.

13

వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చియున్నది.

14

అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించువానివలె క్రుంగుచుంటిని.

15

నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.

16

విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.

17

ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము

18

అప్పుడు మహా సమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.

19

నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీటనియ్యకుము.

20

వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్నవారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు.

21

నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు.

22

యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.

23

నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యెమాడుటకు లెమ్ము.

24

యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్నుబట్టి వారు సంతోషింపకుందురు గాక.

25

ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక

26

నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవమానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక

27

నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.

28

నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

అధ్యాయం 34 అన్ని అధ్యాయాలు అధ్యాయం 36
క్రాస్ రిఫరెన్సులు