Psalms

కీర్తనలు 36

12 వచనాలు 150 అధ్యాయాలలో 36
కీర్తనలు 36 — ఆడియో
అధ్యాయం 36 / 150
కీర్తనలు 36 12 వచనాలు
1

భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.

2

వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడువరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది.

3

వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసియున్నాడు.

4

వాడు మంచముమీదనే పాపయోచనను యోచించును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.

5

యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.

6

నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే

7

దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.

8

నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు.

9

నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము.

10

నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలుపుము.

11

గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.

12

అదిగో పాపము చేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.

అధ్యాయం 35 అన్ని అధ్యాయాలు అధ్యాయం 37
క్రాస్ రిఫరెన్సులు